ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. తమ నాయకుడు మనీష్ సిసోడియాను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్ నంబర్ 1లో ఉంచారని విమర్శించింది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు బుధవారం ఆరోపించారు. ‘ఒక అండర్ ట్రయల్ ఖైదీని సెల్ నంబర్ 1లో ఎప్పుడూ ఉంచరు. ఆ సెల్‌లో ఉండే వారు చాలా మర్డర్ కేసులతో సంబంధం ఉండి అరెస్టైన కరడుగట్టిన నేరగాళ్లు. వారిలో కొందరు మానసిక స్థిమితం లేనివారు. మరో కేసు నమోదైనా ఆ నేరస్తులకు పట్టదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు మనీష్ సిసోడియాకు ప్రాణహాని ఉందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సిసోడియాను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? తొలిసారి అరెస్ట్ చేసిన ఖైదీని కరుడుగట్టిన నేరస్థుల వద్ద ఎప్పుడైనా ఉంచారా?’ అని ప్రశ్నించారు. అయితే ఆప్ నేత మనీష్ సిసోడియాను సీనియర్ సిటిజన్ల సెల్‌లో ఉంచినట్లు జైలు అధికారులు ఇటీవల తెలిపారు. ఢిల్లీ మాజీ మంత్రి అయిన ఆయనకు ఇతర ఖైదీల మాదిరిగానే ప్రాథమిక సౌకర్యాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
Also Read : Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్