విమెన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై నేడు జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఈ టోర్నీలో వరుసగా మూడో గెలుపు అందుకుంది. ఇస్సి వాంగ్, శిఖా ఇషాక్, హేలీ మాథ్యూస్ తలా మూడు వికెట్లతో సత్తా చాటడంతో ఢిల్లీ 18 ఓవర్లు మాత్రమే ఆడి 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 31 పరుగులకు మూడు వికెట్లు (షఫాలీ వర్మ-2; ఎలీస్ క్యాప్సీ-6; మారిజాన్ కాప్-2) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ మెగ్ లన్నింగ్- జెమైమా రోడ్రిగ్యూస్ లు నాలుగో వికెట్ కు 50 పరుగులు జోడించారు. మూడు పరుగుల తేడాతో వీరిద్దరూ ఔటయ్యారు. లన్నింగ్ 43; రోడ్రిగ్యూస్-25 పరుగులు చేశారు. వీరిద్దరి తరువాత మిలిగిన ప్లేయర్స్ దారుణంగా విఫలమై పెవిలియన్ కు క్యూ కట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ముంబై తొలి వికెట్ కు 65 పరుగులు చేసింది. యస్తికా భాటియా 32 బంతుల్లో 8 ఫోర్లతో 41; మాథ్యూస్ 32 పరుగులు చేసి ఔటయ్యారు. నటాలీ స్కివర్ బ్రంట్ (23)- కెప్టెన్ హర్మన్ ప్రీత్ (11) లు అజేయంగా నిలబడి 15 ఓవర్లలోనే గెలిపించారు.
ఢిల్లీ బౌలర్లు ఎలీస్ క్యాప్సీ, తారా నోరిస్ చెరో వికెట్ పడగొట్టారు.
షైకా ఇషాక్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.