సాయికుమార్ వారసుడుగా ఆది సాయికుమార్ తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబము నుంచి వచ్చిన ఆది, కెరియర్ తొలినాళ్లలోనే సక్సెస్ లు చూశాడు. హీరో కంటెంట్ ఉన్న కుర్రాడే అనిపించుకున్నాడు. అయితే ఆ తరువాత నుంచి ఆయనకి హిట్ అనేది దూరమవుతూ వచ్చింది. అయినా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా తన ప్రయత్నం తాను చేస్తూనే వెళుతున్నాడు.
అలా ఆయన నుంచి వచ్చిన మరో సినిమానే ‘సీఎస్ఐ సనాతన్’. శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. ఈ సినిమాలో హీరోగా .. టైటిల్ రోల్ నే ఆది సాయికుమార్ పోషించాడు. ఒక మర్డర్ మిస్టరీని చేధించే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్టుగా ఈ సినిమాలో ఆయన కనిపిస్తాడు. తన పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేశాడు. అయితే కథ .. స్క్రీన్ ప్లే .. ఇతర పాత్రలను డిజైన్ చేసిన తీరు అంతగా ఆకట్టుకోవు. దాంతో ఆడియన్స్ కి ఈ సారి కూడా అసంతృప్తినే కలుగుతుంది.
ఈ సినిమాలోనే కాదు .. ఈ పుష్కర కాలంలో చేసిన మిగతా సినిమాల్లోను ఆది సాయికుమార్ బాగానే చేశాడు. డాన్స్ .. ఫైట్స్ విషయంలోను ఆయనకి వంక బెట్టవలసిన అవసరం లేదు. యాక్షన్ .. రొమాన్స్ లోను మంచి మార్కులే తెచ్చుకుంటూ వెళుతున్నాడు. అయితే కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. పాటల విషయాల్లో ఆయన అవసరమైనంత దృష్టి పెట్టకపోవడం వలన, ఆశించిన ఫలితాలు అందడం లేదేమో అనిపిస్తోంది.
టైటిల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకూ కావసినంత కసరత్తు జరక్కుండానే సెట్స్ పైకి వచ్చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనని అనుకోవాలి. కథ అన్ని వైపులా నుంచి ఎలా అల్లుకుంటూ నడవాలి? .. ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు కథలో కుదురుకున్నాయా లేదా? కొత్తగా ఏం చెబుతున్నాము? అనే విషయాలపై ఆయన సాన పెడితే సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లే అవకాశాలు ఇప్పటికీ లేకపోలేదు.