మాజీ ముఖ్యమంతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బిజెపి కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఆయన చేరిక ఇక లాంఛనమే అని తెలుస్తోంది. హైదరాబాద్ లోని పోలీస్ అకాడెమిలో రేపు ఉదయం జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రాత్రికి ఇక్కడకు వస్తున్నారు. అయన సమక్షంలో నల్లారి బిజెపి లో చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలు కిరణ్ కుమా రెడ్డికి అప్పజెప్పనున్నారని బిజెపి వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. 2014 ఎన్నికల సమయంలో అయన జై సమైఖ్యాంధ్ర పేరుతో ఓ పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కొన్నాళ్ళు రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు అయన రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. పైగా అదే ఎన్నికల్లో అయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పీలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
గత నాలుగేళ్ళుగా కూడా కేవలం ఇంటికే పరిమితమైన ఆయన ఇటీవల ఓ ఓటి టి చానల్ నిర్వహించ ఓ కార్యక్రమం ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చారు. రాజకీయాలు, సిఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం లాంటి అంశాలపై తన అభిప్రాయం చెప్పారు.