శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఈ బాలీవుడ్ భామ ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. ఇది అభిమానులకు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అవుతుందని మేకర్స్ తెలిపారు.
రీసెంట్‌గా కొన్ని నెలల క్రితం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవంతిలో బాద్‌షా కిచ్చా సుదీప్ నటుడిగా తన 25 వసంతాల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలతో పాటు ‘విక్రాంత్ రోణ’ సినిమా లోగోను కలిపి 180 సెకన్ల స్నీక్ పీక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ అడుగుపెట్టడం అనేది అందరిలో ఎక్సైట్‌మెంట్‌ను తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ… ‘‘మా ‘విక్రాంత్ రోణ’ సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది అభిమానులకు, ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్‌గా, వారిని థియేటర్లకు రప్పించేలా ఉంటుంది. జాక్వలైన్ చాలా ప్రొఫెషనల్ నటి’’ అన్నారు.
డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడుతూ… ‘విక్రాంత్ రోణ’ చిత్రంలో జాక్వలైన్ భాగం కావడం అనేది కథలో మరో కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. ఈ ప్రపంచానికి సరికొత్త హీరోగా ‘విక్రాంత్ రోణ’ పరిచయం అవబోతున్నాడు. ఈ సినిమాలో విజువల్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది’’ అన్నారు.
జాక్వలైన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ… ‘విక్రాంత్ రోణ’ సినిమా చాలా స్పెషల్ మూవీ. ఈ ప్రపంచానికి ప్రత్యేకమైన భారతీయ కథను ఈ సినిమా ద్వారా తెలియజేయబోతున్నారు. ఈ భారీ రేంజ్‌లో రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్‌లో నేను భాగం కావడాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.
బాద్‌షా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ… ‘మేం సినిమాను ఎలాంటి ఉత్తేజంతో స్టార్ట్ చేశామో అదే ఉత్తేజంతో పూర్తి చేయాలనుకుటున్నాం. మా ఎంటైర్ టీమ్ పాజిటివ్ దృక్పథంతో ముందుకెళుతుంది. అందరికీ థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమై పాట, సినిమా సహా మా అందరిలో ఓ ఎనర్జీకి కారణమైన జాక్వలైన్ గారికి ధన్యవాదాలు. మీ డాన్స్ నాలోని ఎనర్జీని రెట్టింపు చేసింది. ఇలాగే మీరు ఆత్మీయానుభూతిని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
బాహు భాషా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా పలు భాషల్లో రూపొందుతోన్న ‘విక్రాంత్ రోణ’ త్రీడీలో 14 భాషలు, 55 దేశాల్లో విడుదలవుతుంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్(షాలిని ఆర్ట్స్) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియన్(ఇన్‌వెనో ఫిలింస్) సహ నిర్మాత. బి.అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.జి.యఫ్ ఫేమ్ శివకుమార్ భారీ సెట్స్ వేశారు. అలాగే విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.