అహ్మాదాబాద్ టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 571 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ (186) 14 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
నిన్న మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 289 రన్స్ చేసిన ఇండియా….లంచ్ విరామం సమయానికి జడేజా (29) వికెట్ కోల్పోయింది. శ్రీకర్ భరత్ 44 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీ-అక్షర్ పటేల్ లు ఆరో వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ వచ్చిన కాసేపటికే కోహ్లీ టెస్టుల్లో తన 28వ, కెరీర్ లో 75వ సెంచరీ నమోదు చేశాడు.
అక్షర్ 79 పరుగులు చేసి ఔట్ కాగా, తర్వాత వచ్చిన అశ్విన్(7), ఉమేష్ యాదవ్ (డకౌట్) లు త్వరగా వెనుదిరిగారు, 364 బంతుల్లో 15 ఫోర్లతో (51.10 స్ట్రయిక్ రేట్) 186 పరుగులు చేసిన కోహ్లీ తొమ్మిదో వికెట్ గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
నేడు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్ట పోకుండా 3 పరుగులు చేసింది.
ఆటకు రేపు చివరి రోజు కావడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను ఇండియా 2-1తో గెల్చుకోనుంది.