ఈడి, సిబిఐలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను కేంద్రంలోని BJP ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. తాము దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే….బిజెపి నేతలు దేవుళ్ళతో రాజకీయాలు చేస్తున్నరని మండిపడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.
దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడండని మంత్రి తలసాని బిజెపి నేతలకు సవాల్ చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం సరి కాదని, ఉద్యమాలే ఊపిరిగా చేసుకున్న ముఖ్యమంత్రి KCR కూతురు కవితను వేధిస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను MLC కవిత విశ్వవ్యాప్తం చేశారని, మహిళలను కించపరిచే విధంగా BJP అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపనీయం అన్నారు. రానున్న ఎన్నికలలో BJP కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి తలసాని హెచ్చరించారు.