భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను స్థూలంగా రూపొందించింది. ప్రజాప్రతినిధులు వీలయినంత వరకు ప్రజల్లోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యాంశాలు
పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచన. ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి. పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదా పట్టణాల్లోని డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు నిర్వహించాలి. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలి.
ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ ఆత్మీయ సమ్మేళన నిర్వహణ పూర్తి కావాలి. జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలి. ఈ కార్యక్రమం కూడా ఏప్రిల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి కావాలి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన ప్రభుత్వం, మన పార్టీ నిర్ణయించింది.
జూన్ 1 న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపట్టాలి. దీంతోపాటు 2023-24 విద్య సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టాలి.
ఏప్రిల్ 25 న నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించుకోవాలి. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుంది.