Saturday, November 23, 2024
HomeTrending Newsఅదానీ-హిండెన్‌ బర్గ్‌ అంశాలే విపక్షాల అజెండా

అదానీ-హిండెన్‌ బర్గ్‌ అంశాలే విపక్షాల అజెండా

పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో విడుత సమావేశాలు సోమవారం నుంచి మొదలై ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరానికి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌ను సైతం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మరో వైపు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానుండడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోమవారం ఉదయం సమావేశంకానున్నాయి.

పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో ఉదయం 10గంటలకు విపక్ష నేతలు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.

కాంగ్రెస్‌ అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. అదానీ-హిండెన్‌ బర్గ్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వాన్ని జేపీసీ కోసం డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. అలాగే ఇటీవల ఈడీ, సీబీఐ దాడులపై సైతం కేంద్రాన్ని నిలదీసే అవకాశాలున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్