రాజకీయాల్లో ఆస్కార్ అవార్డులు ఉంటే ప్రతియేటా పవన్ కళ్యాణ్ కే వస్తాయని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. అసలు పవన్ కు ఎవరూ పోటీయే ఉండరని, ఏవైనా ఉంటే మంగళగిరి, ఇప్పటం, మచిలీపట్నంలో అయన మాట్లాడిన మాటలే ఆయనకు పోటీ వస్తాయని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.
కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆయన విమానం ఎక్కగానే అవి కూడా గాల్లో కలిసి పోతున్నాయని విమర్శించారు. ‘పవన్ దగ్గర డబ్బులున్నాయి, అయన విమానాల్లో తిరుగుతున్నారు, ఒక్కో సినిమాకు 60,70 కాకపొతే 90 కోట్ల వరకూ తీసుకోవచ్చు, మాకు ఈర్ష్య ఏమీ లేదు…కానీ మాటలు గాల్లోనే కలిసిపోతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. పవన్ లోపాయికారీ ఒప్పందాల స్పెషలిస్ట్ అంటూ అభివర్ణించారు.
తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని చెప్పిన పవన్ … 2014 నుంచీ ఇప్పటి వరకూ ఎలాంటి రాజకీయాలు చేశారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టకుండా కేవలం లోకేష్ పై విమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడానికి విడిగా పోటీ చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కాపులు ఓటేస్తే ఓడిపోయేవాడిని కాదని పవన్ నిన్న చెప్పారని, అంటే ఒక కులం ఓటేస్తేనే ఎమ్మెల్యే అయిపోతారా, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి అంటూ పవన్ ను సూటిగా అడిగారు. రాష్ట్రంలో అన్ని వర్గాలవారూ సిఎం జగన్ తో ఉన్నారని, ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్దాంతం కోసం నిలబడిన వ్యక్తీ జగన్ అని పేర్ని చెప్పారు.