ప్రపంచంలో 800 కోట్ల జనాభాకు అవసరమైన మందుల తయారీకి ప్రధాన ఆధారం ఔషధ మొక్కలే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రసాయనిక పదార్థాల నుండి తయారయ్యే సౌంధర్య ఔషధాలు ఆరోగ్యానికి హానికరమని, ఔషధ మొక్కల నుండి వచ్చే మందులు వాడడం ఆరోగ్యానికి మంచిదన్నారు. ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR ) సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ మరియు అరోమటిక్ ప్లాంట్స్ (CIMAP) లో జరిగిన కిసాన్ మేళాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రాజెక్ట్ సీనియర్ ప్రిన్స్ పల్ సైంటిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు (లక్నో), తెలంగాణ ఉద్యానశాఖ ఉప సంచాలకులు బాబు గారు, Director of CSIR-CIMAP-Lucknow (UP) డాక్టర్ ప్రభోద్ కుమార్ త్రివేది గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సహజమైన ఉత్పత్తులకు సమాజంలో ఆదరణ పెరుగుతున్నదన్నారు. ఔషధ మొక్కల పెంపకంతో రైతులకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు. ఏదైనా ప్రత్యేక పంట, పదార్థం అధికంగా ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు దానిని సాగు చేస్తే ఖచ్చితంగా తిరిగి తీసుకుంటామని చెబితేనే రైతు ఉత్సాహంగా కష్టపతాడన్నారు. ఔషధ మొక్కల ప్రపంచ మార్కెట్ ను చైనా శాసిస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత క్యూబా, తైవాన్ లు ఉన్నాయి .. అక్కడ పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే వ్యవస్థ ఉన్నందుకే ఇది సాధ్యమయిందన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుండి వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని, కానీ కేంద్రం తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నదన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో బియ్యం లేవు అని కేంద్రం అంటున్నదని, యాసంగిలో 56.44 లక్షల ఎకరాలలో తెలంగాణలో వరి సాగవుతున్నదని మంత్రి చెప్పారు. దేశ అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఎంత కావాలి ? ఎంత అవసరం ? అన్న శాస్త్రీయ అంచనాలు, లెక్కలు కేంద్రం వద్ద లేవని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో పండే పంటల సాగును అంచనావేసి దానికి అనుగుణంగా పంటలను ఉత్పత్తి చేయించాలని, మార్కెట్ డిమాండ్, అవసరాలకు అనుగుణంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.