తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తాను 6 అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు 90 ఇచ్చారని గుర్తు చేశారు. ఈనెల 24న తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారిని వ్యక్తిగతంగా సాయం అందించాలని, ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం డబ్బు వృథా చేయొద్దని ఆయన సూచించారు. కేటీఆర్ పిలుపు మేరకు తాము కూడా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు పంపిణీతో పాటు ఇతర సాయం అందిస్తామని మంత్రులు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు సైదిరైడ్డి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ తదితరులు ప్రకటించారు.