ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబిఏ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతోన్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ 48 కిలోల విభాగంలో నీతూ, 75 కిలోల విభాగంలో స్వీటీ బూర స్వర్ణ పతకాలు సాధించారు.
మినిమం వెయిట్ విభాగంలో నీతూ.. మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ పై విజయం సాధించి ఈ టోర్నీలో ఇండియాకు తొలి స్వర్ణం అందించింది. హర్యానాకు చెందిన నీతూ ఇదే విభాగంలో బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా స్వర్ణం గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెల్చుకోవడం విశేషం. 2017లో మన దేశంలోని గౌహతి, 2018లో హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరిగిన బాక్సింగ్ యూత్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా నీతూ గోల్డ్ మెడల్స్ చేజిక్కించుకుంది.
నేడు జరిగిన మరో మ్యాచ్ లో 75 కిలోల విభాగంలో స్వీటీ బూర… చైనా ప్లేయర్ ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది, హర్యానా రాష్ట్రానికి చెందిన స్వీటీ 2022 లో ఆసియన్ ఛాంపియన్ షిప్స్ లో స్వర్ణం గెల్చుకుంది.
నేడు ఇద్దరు హర్యానా క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించడం గమనార్హం.
రేపు తెలంగాణ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో వియత్నాం ప్లేయర్ గుయెన్ తితమ్ తోను; లవ్లీనా బార్గోహైన్ 75 కిలోల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్ పార్కర్ అన్నే తో ఫైనల్ మ్యాచ్ ఆడడున్నారు.