ప్రస్తుతం నాగోల్ వరకు ఉన్న మెట్రోలైన్‌ను ఎల్బీనగర్‌కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని, వచ్చే టర్మ్‌లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే దీన్ని పూర్తి చేస్తుందని వెల్లడించారు. ఎస్‌ఆర్‌డీపీలో రూ.32 కోట్లతో చేపట్టిన 19వ ప్రాజెక్టు ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఈ విషయం కాం గ్రెస్, బీజేపీలకు కూడా తెలుసని చెప్పారు. ప్రజారవాణా మెరుగుపడాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తీరాయని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.658 కోట్లతో 12 పనులను చేపట్టి తొమ్మిదింటిని పూర్తి చేశామని, మిగిలిన పనులను సెప్టెంబర్ నాటికి పూ ర్తి చేస్తామని ప్రకటించారు. ఆ పనులను పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
వచ్చే వర్షాకాలం నాటికి పనులన్నీ పూర్తి
రూ.985 కోట్లతో చేపడుతున్న ఎస్‌ఆర్‌డీపీ పనులన్నింటినీ వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. జీవో నంబర్ 118 కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ నెలాఖరు నాటికి పట్టాలను అందిస్తామని చెప్పారు. మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తామని వెల్లడించారు. జీవో నెం.58, 59 కింద హైదరాబాద్ నగరంలో లక్షా 25 వేల మందికి పట్టాలు ఇచ్చామని, పెంచిన గడువుతో మిగిలిపోయిన పేదవాళ్లందరికీ పట్టాలందజేస్తామని స్పష్టం చేశారు. గడ్డి అన్నారంలో నిర్మిస్తున్న వెయ్యి పడకల టిమ్స్ దవాఖానను ఏడాదిన్నర కాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీమంత్రి పట్నం మహేందర్‌డ్డి, శానసమండలి సభ్యుడు బొగ్గారపు దయానంద్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా, డిఫ్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, కార్పోరేటర్లు వెంకటేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్‌ఈ రవీందర్‌రాజు, ఈఈ రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు నామకరణం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ పేరును పెడతామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీచేస్తామని తెలిపారు.