జీవితంపై ఎన్నో ఆశలతో కెనడా చేరిన వందలాది మంది భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏజెంట్ మోసంతో డీపోర్టేషన్ గండం పొంచి ఉన్నది. లక్షలాది సొత్తును కోల్పోవడంతో పాటు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత దేశానికి పయణమయ్యే పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన దాదాపు 700 మంది విద్యార్థులు కెనడా వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా బహిష్కరణ గండాన్ని ఎదుర్కొంటున్నారు. జలంధర్‌కు చెందిన ఓ ఏజెంట్ ఫేక్ అడ్మిషన్ లెటర్లతో వీళ్లందరికీ వీసాలు ఇప్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఫేక్ ఆఫర్ లెటర్‌తో కెనడాకు..
ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ పేరుతో బ్రిజేశ్ మిశ్రా అనే ఏజెంట్ కన్సల్టెన్సీని జలంధర్ లో నిర్వహించాడు. వంద లాది మంది విద్యార్థులను ఫేక్ డాక్యుమెంట్లతో వీసాలు ఇప్పించి కెనడాకు పంపాడు. ఆ తర్వాత కార్యాలయాన్ని మూసివేశాడు. వాస్తవానికి కెనడాలో చదువుకునేందుకు వీసా కావాలంటే ముందుగా అక్కడి కళాశాలలు ఇచ్చే అడ్మిషన్ ఆఫర్ లెటర్‌ను, ఫీజు కట్టినట్లుగా రిసిప్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కెనడా ప్రభుత్వం ఎడ్యుకేషన్ వీసాలు మంజూరు చేస్తుంది.
బ్రిజేశ్ 2018–19లో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి కెనడా పంపాడు. అక్కడికి వెళ్లిన వారంతా ఆయా కాలేజీల్లో చేరి చదువుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. వీరిలో కొంత మంది ఆఫర్ లెటర్లో పేర్కొన్న కాలేజీలోనే తర్వాతి సెమిష్టర్‌లో చేరారు. మరికొందరు ప్రైవేటు కాలేజీలో అడ్మిషన్ లెటర్ పొంది.. అక్కడికి వెళ్లాక గవర్నమెంట్ కాలేజీల్లో చేరారు. వీరంతా ఉన్నత విద్య పూర్తి చేసుకొని.. ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరారు. ఇక కెనడాలో పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ఇటీవల ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంలో ఏజెంట్ బ్రిజేశ్ మిశ్రా విద్యార్థులందరికీ బురిడీ కొట్టించాడు. కెనడాలోని హంబర్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తానని ఒక్కో స్టూడెంట్ నుంచి అడ్మిషన్ ఫీజు సహా రూ.16 లక్షలను వసూలు చేసినట్లు సమాచారం. అక్కడికి వెళ్లాక వేరే కాలేజీలో జాయిన్ కావచ్చని, ఇబ్బందేమీ ఉండదని నమ్మబలికాడు. అన్ని డాక్యుమెంట్లపై సంబంధిత స్టూడెంట్ల సంతకాలే పెట్టించాడు. ఎక్కడా కన్సల్టెన్సీ పేరు గానీ, ఏజెన్సీ పేరు లేకుండా జాగ్రత్తపడ్డాడు.
కెనడా వెళ్లాక ప్రైవేట్ కాలేజీల నుంచి సర్కారు కాలేజీల్లో చేరిక వారికి ఫీజు సైతం వెనక్కి ఇప్పించాడు. కానీ, కాలేజీ షిఫ్ట్ అయిన విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి చెప్పకపోవడంతో విద్యార్థులు ఇరుక్కు పోయారు. ఫేక్ ఆఫర్ లెటర్లతో వీసాలు పొందినందున కెనడా నుంచి ఎందుకు పంపించకూడదంటూ కెనడియన్ ఏజెన్సీ డీపోర్టేషన్ లెటర్లు పంపింది. దీంతో కోర్టుల్లో సవాల్ చేయడం.. లేదంటే భారత్‌కు రావడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. వాస్తవానికి కోర్టుకు వెళ్లినా భారతీయులకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే విద్యార్థుల అప్లికేషన్లలో కోడ్ ప్రస్తావన లేకపోవడమే కారణమని పేర్కొంటున్నారు. వాస్తవానికి అప్లికేషన్ సమయంలో ఏజెన్సీ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
వీరందరి దరఖాస్తుల్లో ఎక్కడా ఏజెన్సీ ప్రస్తావన లేదు. అంతా ఆయా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా ఉన్నది.ఈ వ్యవహారంలో బ్రిజేశ్ మిశ్రా చాకచక్యంగా ఏజెన్సీ పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో ఈ ఫేక్ డాక్యుమెంట్లకు విద్యార్థినే కెనడా ప్రభుత్వం బాధ్యుడిని చేస్తుంది. వీరంతా స్థానిక లాయర్లతో కోర్టుకు వెళ్లినా అనుకూల ఫలితం రాకపోవచ్చని తెలుస్తుంది.
ఉన్నత చదువులు చదివి కెనడాలో స్థిరపడేందుకు వెళ్లాలనుకుంటున్న వారు అక్కడి కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తు విధానం రెండు రకాలుగా ఉంటుంది. స్టూడెంట్ సొంతంగా, ఏజెన్సీ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏజెన్సీ ద్వారా వెళ్లే సమయంలో తప్పనిసరిగా అప్లికేషన్‌లో కోడ్ ఉందా? లేదా ? చూసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఆయా ఏజెన్సీని, ఏ కాలేజీలో అడ్మిషన్ వచ్చినా.. యాజమాన్యాన్ని సంప్రదించి వివరాలను తెలుసుకోవాలని చెబుతున్నారు.
కాలేజీ వెబ్‌సైట్‌లో సైతం వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. విద్యార్థికి సంబంధించి వివరాలతో పాటు ఫీజు తదితర అన్ని వివరాలు పొందుపరిచి ఉంటాయని, తద్వారా మోసపోకుండా ఉంటారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఫేక్ డాక్యుమెంట్లు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. చదువులు పూర్తయిన తర్వాత పర్మినెంట్ రెసిడెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుల పరిశీలన కఠినంగానే ఉంటుంది. దాంతో పదో తరగతి, ఇంటర్, డ్రిగీ ఇలా ఏమైనా అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్‌వే ఇవ్వాలని, ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చిన సందర్భంలో దొరికేపోయే అవకాశాలుంటాయి. దాంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ దేశం నుంచి తిరిగి స్వదేశానికి పంపుతుందని హెచ్చరిస్తున్నారు.