తాను జనంలో ఉంటానని, జనం తనతో ఉంటారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పారని, మరొకరికి సీటు ఇస్తామని వారిని గెలిపించాలని తనతో అన్నారని… దీనిపై తాను ఎంతో బాధపడ్డానని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని, చివరిసారి పోటీ చేస్తానని జగన్ ను అడిగానని చెప్పారు. ఉదయగిరి సీటు వేరే వారికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే తనను పార్టీ నుంచి పంపేశారని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సూచించిన వారికే ఓటేశానని, అయినా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది కోట్ల రూపాయలు ముడుపులు అందినట్లు, ఏదో కాంప్లెక్స్ లు కొన్నట్లు వచ్చిన వార్తలపై తీవ్రంగా ప్రతిస్పందిచారు. ఇంతవరకూ ఏ తెలుగుదేశం నాయకుడూ తనను సంప్రదించలేదని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు. అవసరమైతే రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కూడా గెలిచే సత్తా ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇచ్చినా అది నలభై శాతం మాత్రమేనని, తన వ్యక్తిగత ఇమేజ్ మరో 60శాతం వల్లే ఎన్నికల్లో గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఓటమి ఖాయమని, వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని, గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తానని, అనిల్ గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తారా అంటూ చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు.
Also Read : పది కాదు, మీ ముగ్గురూ గెలవండి : అనిల్ సవాల్