Friday, October 18, 2024
HomeTrending NewsGutha fire: బిజెపి హయంలో ప్రజాస్వామ్యం ఖూనీ - గుత్తా

Gutha fire: బిజెపి హయంలో ప్రజాస్వామ్యం ఖూనీ – గుత్తా

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: మండలి చైర్మన్‌ గుత్తా నల్లగొండ: దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చెప్పారు. లక్షల కోట్లు దోచుకున్న కార్పొరేట్ దొంగలపై ఎలాంటి విచారణలు ఉండవు. కానీ లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో కేంద్రం దూరాలోచన చేసి, ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ మీద కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన పనితీరుతో మంత్రి కేటీఆర్‌.. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్‌కు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విపక్షాలపై ఫైరయ్యారు.

టీఎస్‌పీఎస్సీ  స్వతంత్ర సంస్థ అని, కొంతమంది స్వార్థంవల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి దోషులపై కఠిన చర్యలు చేపట్టిందని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ నిజాయితీ పరుడని, ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఏంమాట్లాడుతున్నారో వారికే అర్ధంకావడం లేదని విమర్శించారు. అసత్యాలు ప్రచారం చేయడమే వారి పనని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. అప్రజాస్వామిక విధానాలను బీజేపీ ప్రభుత్వం విడనాడాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్‌ అసెంబ్లీ పాస్‌చేసిన బిల్లులను పెండింగ్‌లోపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వెల్లడించారు. రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ విషం కక్కడం సరికాదని, కక్ష్య సాధింపు ధోరణి మంచిది కాదని సూచించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని మండలి చైర్మన్‌ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్