కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, అలా జరుగలేదు. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. వయనాడ్ ఉప ఎన్నిక నిర్వహణకు ఎలాంటి హడావుడి లేదని తేల్చేశారు. ‘వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక విషయంలో ఎలాంటి హడావుడి లేదు. కేసు విషయంలో అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు రాహుల్‌గాంధీకి నెలరోజుల సమయం ఇచ్చింది. మేం వేచి చూస్తాం. ఆ గడువు తర్వాత మేం స్పందిస్తాం.
వయనాడ్ స్థానం మార్చి 23న ఖాళీ అయింది. చట్టంప్రకారం.. ఆరునెలల్లో ఎన్నిక నిర్వహించాలి. అయితే మిగిలిన పదవీకాలం సంవత్సరంలోపే ఉంటే.. అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిన పని లేదని చట్టం చెబుతున్నది. కానీ, వయనాడ్ విషయంలో అది ఏడాదికి మించి ఉంది’ అని పేర్కొన్నారు. అప్పీల్ సమయం ముగిసిన తర్వాత వయనాడ్ ఎన్నిక నిర్వహణపై నిర్ణయం తీసుకొంటామని సీఈసీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయం సాధించారు. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు ఇటీవల రెండేండ్ల జైలుశిక్ష విధించింది. పై కోర్టులో అప్పీల్‌కు 30 రోజుల సమయమిచ్చింది. అయితే, తీర్పు వెలువడిన 24 గంటల్లోనే లోక్‌సభ సచివాలయం రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నది. అయితే, పై కోర్టులో అప్పీల్‌కు ట్రయల్ కోర్టు నెల రోజులు సమయమిచ్చినా, రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని హడావుడిగా రద్దు చేయడమేంటని విమర్శలు వ్యక్తమయ్యాయి.
Also Read :Karnataka : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల