కియా పరిశ్రమ తీసుకురావడంలో నాటి సిఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందని… పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి, అధికారులు చొరవ తీసుకుని ఇక్కడ కియాను ఏర్పాటు చేయించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ దిగారు. కియా ద్వారా 25 వేల ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని సిఎం జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ళలో తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు సెల్ఫీ దిగి చూపించగలరా అంటూ సిఎం జగన్ కు సవాల్ చేశారు.
2019 లో తమ పార్టీ ఓడిపోయినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని, రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేసినా ప్రజలు ఎందుకు ఇలా తీర్పు ఇచ్చారనేది అర్ధం కాలేదని పేర్కొన్నారు. చేసిన పని చెప్పుకోవడంలో తాము విఫలమయ్యమని అంగీకరించారు లోకేష్. అందుకే తమ హయాంలో నెలకొల్పిన పరిశ్రమల ఎదుట సెల్ఫీ దిగి ఛాలెంజ్ చేస్తున్నామని, ఇది బాగా వైరల్ అవుతోందని… తద్వారా చేసింది చెప్పుకోగలుగుతున్నామని వివరించారు. పెనుగొండలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయా అనేది తనకు కూడా తెలియలేదని వ్యాఖ్యానించారు. నార్కొటిక్స్ బ్యూరో అనుబంధ విభాగాల పరిశ్రమ కూడా వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ బలం…తాము పని చేస్తామని, కానీ బలహీనత…చేసింది చెప్పుకోలేకపోవడమేనన్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 700 కి.మీ. మైలురాయిని పెనుగొండ నియోజకవర్గం, గుట్టూరు గ్రామంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గోరంట్ల మండలం మరియు మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం… టిడిపి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు లోకేష్ హామీ ఇచ్చారు.
Also Read : అణగారిన వర్గాలకు అండ ఈ జెండా: లోకేష్