ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాల ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పన పురోగతిపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. నిర్మల్ లో జరిగిన ఈ సమావేశానికి అటవీ, విద్యుత్, సంబంధిత ఇతర శాఖల ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరయ్యారు.
నిర్మల్ జిల్లాకు సంబంధించి 35 ప్రతిపాదనలు, అదిలాబాద్ 34, అసిఫాబాద్ 84, మంచిర్యాల జిల్లాకు చెందిన 9 ప్రతిపాదనలు మొత్తం 162 వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పురోగతిపై నిర్మల్ లో జరిగిన సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్.ఎం. డోబ్రియాల్ సమీక్షించారు. అటవీ అనుమతుల పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎం.సీ. పర్గెయిన్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, నాలుగు జిల్లాల చీఫ్ కన్జర్వేటర్లు, అటవీ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది హాజరయ్యారు.
అటవీ ఆవాసాలకు విద్యుత్ సరఫరాను అత్యంత ప్రాధాన్యతా అంశంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ ఆవాసాలన్నీ రక్షిత కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో కేంద్ర వన్యప్రాణి సంరక్షణ చట్టంతో పాటు, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతులు తప్పనిసరి. ఎన్ని ప్రతిపాదనలను ఏ దశలో ఉన్నాయి. అన్ లైన్ అప్లికేషన్ల విధానం, సత్వర అనుమతుల ప్రక్రియ కోసం పాటించాల్సిన నియమాలు, శాఖల మధ్య సమస్వయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించిన అటవీ అనుమతుల విధానానికి లోబడి ప్రతిపాదనలు ఉండాలని పీసీసీఎఫ్ తెలిపారు. అలాగే ప్రతీ ప్రతిపాదన కోసం మళ్లించే అటవీ భూమికి సమానమైన నాన్ ఫారెస్ట్ లాండ్ (అటవీ భూమి కానటువంటి) కేటాయింపులు ఉండాలన్నారు. ఇంజనీర్లు, ఇతర సిబ్బంది అనుమానాలను కూడా ఉన్నతాధికారులు నివృత్తి చేశారు. లోపాలు లేకుండా ప్రతిపాదనలు ఉంటే అటవీ అనుమతులను కేంద్రం నుంచి త్వరగా సాధించవచ్చని స్పష్టం చేశారు.