జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గత రాత్రి హస్తినకు చేరుకున్న ఆయన నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో భేటీ కానున్నారు. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా జనసేన ఉంది. అయితే రెండు పార్టీలూ కలిసి పోరాటం చేయడంలేదు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోలేక పోయాయి. బిజెపి జాతీయ నేతలు తమ పట్ల సానుకూలంగా ఉన్నా రాష్ట్ర నాయకత్వం సరిగా వ్యవహరించడం లేదని పవన్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ సూచిస్తున్నారు. టిడిపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని, తమ పొత్తు జనసేనతో మాత్రమేనని బిజెపి రాష్ట్ర నేతలు కరాఖండిగా చెబుతున్నారు. జనసేన తమతోనే ఉందని బిజెపి రాష్ట్ర నేతలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
మరోవైపు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బిజెపి అధిష్టానం భావిస్తున్న దృష్ట్యా ఈ విషయమై చర్చించేందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.
Also Read : Pawan-Fire: నా యుద్ధం నేనే చేస్తా: పవన్ కళ్యాణ్