Sunday, November 24, 2024
HomeTrending NewsDoddi Komuraiah:చైతన్య స్పూర్తి దొడ్డి కొమురయ్య త్యాగం - సిఎం కెసిఆర్

Doddi Komuraiah:చైతన్య స్పూర్తి దొడ్డి కొమురయ్య త్యాగం – సిఎం కెసిఆర్

తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి త్యాగాలను స్మరించుకున్నారు. దొడ్డి కొమురయ్య అమరత్వం అందించిన చైతన్య స్పూర్తి, మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొనసాగిందని సిఎం అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకోసం పార్లమెంటరీ పంథాలో సాగిన శాంతియుత పోరాటంలో, సబ్బండ వర్గాలు తమ వంతుగా ఉద్యమించాయని, తమ ఆకాంక్షలను చాటడంలో దొడ్డి కొమరయ్య స్పూర్తి ఇమిడి వున్నదని సిఎం అన్నారు.
అమర వీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకోసం శ్రమిస్తున్నదని సిఎం తెలిపారు. బీసీ కుల వృత్తులను పరిరక్షిస్తూ వారిని ప్రగతి పథంలో నడుపేందుకు, వారికి అన్ని విధాలా సాయం అందిస్తున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు. కుల వృత్తిదారులైన గొల్ల కుర్మల అభివృద్ధికోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం, వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అధికభాగం లబ్ధిదారులు బిసి బిడ్డలే కావడం గొప్ప విషయమని సిఎం అన్నారు.
ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు, ఆసరా ఫించన్లు, రైతుబంధు సహా అనేక పథకాలు బీసీల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో తెలంగాణలో నేడు బీసీల స్థితి గతులు గుణాత్మకంగా పురోగమించాయని, వారి ప్రగతి సామాజిక ప్రగతికి బాటలు వేసిందన్నారు. నేడు దేశ అర్థిక వ్యవస్థకే వెన్నుదన్నునందించే రీతిలో తెలంగాణ సబ్బండ కులాలు ముందంజలో వున్నాయన్నారు.
నాటి సాయుధపోరాట కాలం నుంచి నేటి మలి దశ తెలంగాణ ఉద్యమకాలం దాకా దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనలో ముందుకు సాగుతున్నామని సిఎం అన్నారు. అమరుల సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న…అమర జ్యోతి…త్వరలోప్రారంభం కానున్నదని సిఎం అన్నారు. దొడ్డి కొమురయ్య త్యాగానికి గుర్తుగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ వారికి ఘన నివాళులర్పిస్తున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్