Saturday, November 23, 2024
HomeTrending NewsSattupalli: కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు - మంత్రి నిరంజన్ రెడ్డి

Sattupalli: కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు – మంత్రి నిరంజన్ రెడ్డి

పేదలు, రైతుల పార్టీ బీఆర్ఎస్ అని వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం బీరాపల్లిలో ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల తెలంగాణ అభివృద్ధి ప్రతి గడపకూ తెలపాలని మంత్రి పార్టీ శ్రేణులను కోరారు. గ్రామాలలో రోడ్లు బాగయ్యాయి. పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగయింది. సాగు నీరు సమృద్ధిగా ఉంది. పంటలు బాగా పండుతున్నాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు, ఉపాధి అవకాశాలు బలోపేతం అయ్యాయని, వడగండ్ల వానతో రాష్ట్రంలో 2.28 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. వడగండ్ల వాన వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనతో రైతులకు భరోసా ఇచ్చామని, ఆ వెంటనే మరోసారి వానలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యటించారని గుర్తు చేశారు. విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు సాగాలని రైతులలో ధైర్యం నింపారు. విపత్తు వచ్చిన తర్వాత నివేదిక పంపిన తర్వాత తీరిగ్గా నెల, రెన్నెల్లకు కేంద్రబృందాలు పంటనష్టం పరిశీలనకు వస్తాయని విమర్శించారు. అప్పుడు క్షేత్రస్థాయిలో ఏమీ ఉండదు .. తెలంగాణ వచ్చిన తర్వాత విపత్తుల కింద కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రూ.230 కోట్లతో వేంసూరు మండలం కల్లూరిగూడెంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం బీరాపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్ష్యతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, ఖమ్మం జిల్లా పరిశీలకులు, శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్