ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 217 పరుగులు చేయగా లక్ష్య సాధనలో లక్నో 207 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్-డెవాన్ కాన్వేలు ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టింఛి తొలి వికెట్ కు 110 పరుగులు జోడించారు, 8వ ఓవర్లోనే జట్టు వంద పరుగులు పూర్తి చేసుకుంది.
రుతురాజ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57; కాన్వే 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యారు. శివమ్ దూబే-27, అంబటి రాయుడు-27 (నాటౌట్); మోయీన్ అలీ-19; కెప్టెన్ ధోని కేవలం మూడు బంతుల్లో రెండు సిక్సర్లతో 12 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది.
లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ చెరో మూడు; అవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య సాధనలో బరిలోకి దిగిన లక్నో కూడా ధాటిగానే ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కేల్ మేయర్స్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి జట్టు స్కోరు 79 వద్ద ఔటయ్యాడు. దీపక్ హుడా (2) విఫలం కాగా అదే స్కోరు వద్ద కెప్టెన్ రాహుల్ (22) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో నికోలస్ పూరన్ -32; స్టోనిస్-21; అయూష్ బదోనీ-23; చివర్లో కృష్ణప్ప గౌతమ్-17(నాటౌట్), మార్క్ వుడ్-10 (నాటౌట్) ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. దీనితో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ 4; తుషార్ దేశ్ పాండే 2; మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టారు.
మోయిన్ అలీకే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.