వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని సమావేశంలో విపక్ష నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. సమాఖ్య, సమానత్వ, సామాజిక న్యాయ సాధనకు ఉమ్మడి కృషి అవసరమన్నారు. దేశంలో కులగణన చేపట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాను ఆయన తప్పుబట్టారు. బీజేపీ ‘పోలరైజేషన్’ (ఏకీకరణ) రాజకీయాల్ని సామాజిక న్యాయం ద్వారా ఎదుర్కోవాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.
ఆర్థిక అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితం చేయరాదని సీతారాం ఏచూరి చెప్పారు. దేశంలో 40.5శాతం సంపద ఒక్కశాతమున్న ధనికులు, బడా కార్పొరేట్ల చేతిలో ఉందన్నారు. సామాజిక న్యాయం లేకపోతే, ఆర్థిక సమానత్వం ఏర్పడదని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. విభేదాలన్నీ పక్కకు పెట్టి ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని, బీజేపీపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాజస్థాన్ సీఎం గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. డీఎంకే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, జేఎంఎం, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, ఎన్‌సీ, ఎన్‌సీపీ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, రాష్ట్రీయ సమాజ్ పక్ష, లోక్‌తంత్ర సురక్ష, వీసీకే తదితర పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. శివసేన (ఉద్ధవ్ వర్గం), వైసీపీ, బీజూ జనతాదళ్ హజరుకాలేదు.