వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తోన్న వార్తలను మంగళగిరి, గన్నవరం ఎమ్మెల్యేలు ఆర్కే, వల్లభనేని వంశీలు ఖండించారు. సిఎం వైఎస్ జగన్ తన బాస్ అని, ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్ లో తన కుమారుడి ఇంట్లో ఓ ఫంక్షన్ కు హాజరయ్యానని అందుకే సమీక్షకు రాలేదని వివరణ ఇచ్చారు. తనను పార్టీకి దూరం చేయాలని ఒక వర్గం లక్ష్యంగా చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయనప్పుడు వ్యవసాయం చేసుకుంటా తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ లో తాను కోర్స్ చేస్తున్నానని పరీక్షలు ఉండడంవల్లే నిన్నటి సమీక్షా సమావేశానికి హాజరుకాలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. కొడాలి నాని, తాను ఇద్దరం అసంతృప్తితో ఉన్నామని, గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు కలలు కంటున్నారని అవి మెరుపు కలలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వంశీ ధీమా వ్యక్తం చేశారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సిఎం జగన్ నిన్న వర్క్ షాప్ నిర్వహించారు. ఈ భేటీకి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, కొడాలి నాని. వల్లభనేని నాని, మంత్రులు ధర్మాన, బుగ్గన లు హాజరు కాలేదు. కాగా, వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ టికెట్ ఆర్కేకు ఇవ్వడం లేదని, అందుకే ఆయన అలిగారని, నిన్నటి సమావేశానికి కూడా ఈ కారణంతోనే హాజరు కాలేదని, ఇటీవల జరిగిన ఆర్కే కుమారుడి వివాహానికి కూడా సిఎంను ఆహ్వానించలేదని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఆళ్ళ, వంశీలు స్పందించారు.
Also Read : Buggana Rajendranath: మీరు చెప్పేవన్నీ అబద్ధాలే: బుగ్గన