సిక్కింలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండో-టిబెట్ బోర్డర్ సమీపంలోని నాథులా పాస్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ, ఓ చిన్నారి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మంచు కొండల్లో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు పోలీసులతో బాటు సైన్యం, స్థానిక వాలంటీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సిక్కిం రాజధాని గ్యాంగ్ టాక్ నుంచి సరిహద్దుల్లోని నాథుల్లా కనుమలు వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతుంటారు. టూరిస్టులను జవహర్ లాల్ నెహ్రు రోడ్ ( జెఎన్ రోడ్) లో 13 వ మైల్ వరకు మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తుండగా .. వారు పట్టించుకోకుండా 15 వ మైల్ వరకు వెళ్లడం ఈ ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. మంగళవారం సుమారు 80 మంది టూరిస్టులు ఈ ఘోర దుర్ఘటనకు గురి అయినట్టు తెలుస్తోంది.
మధ్యాహ్నం 3 గంటల వరకు వీరిలో దాదాపు 30 మందిని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సముద్ర మట్టానికి 4,310 మీటర్ల ఎత్తులో ఉన్న ఇక్కడి మంచు కొండలను చూసేందుకు, సాధ్యమైనంత వరకు పైకి ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు.
ఎడతెరిపి లేని మంచుతో జెఎన్ రోడ్డులో 350 మంది టూరిస్టులు, 80 వాహనాలు చిక్కుకుపోయినట్టు సమాచారం. సొంగో సరస్సు ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తున్నప్పటికీ, నాణెంలో మరో కోణంలా కొండ చరియలు ప్రమాదాలకు కారణమవుతుంటాయి.