దేశంలో నలభై ఏళ్ళపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత డా. బాబూ జగ్జీవన్ రామ్ కు దక్కుతుందని, ఆయన ఓ గొప్ప పరిపాలనా దక్షుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖలో జరిగిన తెలుగుదేశం పార్టీ జోన్ -1 సమీక్షా సమావేశంలో బాబు పాల్గొన్నారు. జగ్జీవన్ తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో కూడా కలిసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేశామని తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాలు ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ హయంలోనే అందాయన్నారు. తాని సిఎం అయిన తరువాత జస్టిస్ పున్నయ్య కమిటీ వేసి ఆ సిఫార్సులను తూచ తప్పకుండా అమలు చేశామన్నారు. దళితులపై వివక్షను రూపుమాపేందుకు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు.
కానీ ఈ ప్రభుత్వ హయంలో దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని బాబు విమర్శించారు. డా. సుధాకర్ నుంచి నిన్నటి అచ్చెన్న వరకూ ఎంతోమంది మరణాలకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం తాము ప్రవేశ పెట్టిన 27 స్కీములను ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
“కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన ఆదర్శ నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంలో, కార్మిక చట్టాలను రూపొందించడంలో ఆయన పాత్ర కీలకమైనది. సమతావాది, సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయాలను స్మరించుకుందాం” అంటూ సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు పోస్ట్ చేశారు.
Aslo Read : Jagjivan Ram: బాబూ జగ్జీవన్ కు సిఎం జగన్ నివాళి