Kidnap for pizza!
ఆ ఏముంది ఆ పిజ్జాలో ? మైదా పిండి తప్ప అని కొట్టి పారేసేవారు ఉంటే ఉండనీ గానీ తినేవాళ్ళకి అదో బలహీనత. రోజూ తిన్నా వెగటించని ఆహారం. కరోనా కాలంలో కూడా బతికి పోయిన వ్యాపారాల్లో పిజ్జా సెంటర్లూ ఉన్నాయి. పుట్టిల్లు ఇటలీ అయినా రుచులు మార్చుకుంటూ ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అనే తెలుగు ప్రాంతంలో కూడా స్థిర నివాసం సాధించింది పిజ్జా. తాజాగా స్వీడన్ లో కిడ్నాపింగ్ కు సైతం పాల్పడే తెగువ కల్పించింది.
జైళ్లలో ఖైదీలకు కూడా హక్కులుంటాయి. కానీ గొంతెత్తి అడిగితే వచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. పురుగుల అన్నం, నీళ్ల సాంబారు మధ్య అదే పదివేలని తినేస్తూ ఉంటారు. ఎక్కడో తప్ప అడిగే ధైర్యమూ చెయ్యరు. ఇందుకు విదేశాల్లో జైళ్లు మినహాయింపని చెప్పాలి.
గతంలో కూడా అమెరికాలో ఒక తీవ్రవాది పోలీసులకు లొంగిపోడానికి కోరిన కోరిక కోకాకోలా, బర్గర్. అదే ఆదర్శం ఏమో స్వీడన్ లోని ఎస్కిల్ ట్యూనా పట్టణానికి సమీపంలో ఉన్న హాల్బీ హై సెక్యూరిటీ జైలు లో విశేష సంఘటన చోటు చేసుకుంది. హత్యానేరంలో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ఇద్దరు గార్డులను పట్టుకుని బందీ చేశారు. గార్డులు మాత్రమే ఉండే స్థలం లోకి ఎలాగో ప్రవేశించిన ఇద్దరు ఖైదీలూ ఆపైన జైలు అధికారులతో బేరసారాలకు దిగారు. పారిపోడానికి ఒక హెలికాప్టర్, 20 పీజ్జాలు పంపితే గార్డులను విడిచి పెడతామని ఆఫర్ ఇచ్చారు. వారి బలహీనత కనిపెట్టిన అధికారులు ముందయితే పిజ్జాలు తినమని పంపించారు. దాంతో సరిపెట్టుకుని గార్డులని వదిలేసారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఖైదీలను అధికారులు కిడ్నాపింగ్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఆనక వారి పరిస్థితి ఏమిటా ?అడగకపోవడమే మంచిది.