కెనడాలో గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మిస్సిసాగలోని రామ మందిరం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలు, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిరంపై విద్వేష పూరిత వ్యాఖ్యలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి ఓంటారియోలోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా అమర్యాదకర రాతలు రాశారు. ‘హిందూస్థాన్ ముర్దాబాద్’, ‘మోదీని ఉగ్రవాదిగా ప్రకటించాలి’ అంటూ స్పెయర్‌తో పెయింట్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలయం ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు విండ్సర్ పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని.. వారిని పట్టుకునేందుకు స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంట తమకు సమాచారం అందించాలని సూచించారు.