టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలతో రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్మోహన్రావు మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడన్నారు.
జీవన్ రెడ్డి విమర్శల్లో ముఖ్యాంశాలు …
మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కేటీఆర్ పిఏ తిరుపతి ద్వారా తటిపల్లి గ్రామానికి చెందిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఏ 2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి కి టీ ఎస్ పీ ఎస్సీ లో కేటీఆర్ ఆశీస్సులతో ఉద్యోగం వచ్చిందనడంలో సందేహం లేదు. మంత్రి కేటీఆర్ ఇటీవల సిరిసిల్ల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని వందకు పైగా ఒక్కరికి మాత్రమే మార్కులు వచ్చాయని అన్నారని, సిట్ విచారణలో మాత్రం 30 మందికి పైగా 100 మార్కులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఈ విషయమై మంత్రి కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి. మంత్రి కేటీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. ఆంధ్ర ఉద్యోగి టిఎస్పిఎస్సిలోకి ఎలా చొరబడ్డాడు. రాజశేఖర్ రెడ్డి టీఎస్పీఎస్సీ లో నియామకంపై రాజకీయ ప్రమేయం ఉందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించే వద్దన్నదే లక్ష్యంగా కనబడుతోంది. రేపు తనకు నోటీసులు వచ్చినా ఆశ్చర్యం లేదని జీవన్ రెడ్డి అన్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నపత్రాల లీకేజీ మాట్లాడడంతోనే వాస్తవాలు వెలుగు వస్తున్నాయని అన్నారు. టీఎస్పీఎస్సీ లోకి ఆంధ్ర ఉద్యోగి డి ప్యుటేషన్ పై ఏ విధంగా వచ్చారని నిలదీశారు. టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకమే రాజకీయ నియామకమని విమర్శించారు. పదో తరగతి పేపర్ లీకేజీలు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా అరెస్టు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చర్చల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా బండి సంజయ్ అరెస్ట్ తెరపైకి తీసుకువచ్చింది అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపనలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేస్తూ, ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య బేరం కుదిరిందో లేదో అని ఎద్దేవా చేశారు.
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రపూరీతంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బయటకు వచ్చినట్లు కనపడుతుందని ఆరోపిస్తున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎందుకు విచారణ చేపట్టడం లేదన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీతో బండి సంజయ్ కి సంబంధం ఉందా లేదా అని విచారణ చేసి సాక్ష్యాదారాలు ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీస్ వ్యవస్థను కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ వివరాలను ఎందుకు సేకరించడం లేదు అని ప్రశ్నించారు. టీ ఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యం చర్చకు రాకుండా చేసేందుకు 41 సీఆర్పీసి కింద నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి విచారణ చేపట్టకుండా బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
మంత్రి కె టీ ఆర్ పై వస్తున్న ఆరోపణల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు బండి సంజయ్ అరెస్ట్ తెర పైకి తెచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా ప్రభావితం చేయడంలో సీఎం కేసీఆర్ కన్నా మంత్రి కేటీఆరే శక్తివంతుడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేపడుతుందని నమ్మకం ప్రజల్లో కలిగించేందుకు మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ చాంద్ పాషా, చందా రాధా కిషన్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు నేహాల్,పూర్ణ చందర్ రెడ్డి, లైసెట్టి విజయ్ పాల్గొన్నారు.
Also Read : TSPSC: పాలనపై పట్టు కోల్పోయిన కేసీఆర్ : అఖిలపక్షం