లోపాలను సరిదిద్దుకోడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, అందుకే తాను ఆ పార్టీని వీడాల్సివచ్చిందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మనకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్యుడి వద్దకు వెళ్లి తగిన మందులు వాడాలని, అవసరమైన పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుందని, లేకపోతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని కాంగ్రెస్ పారీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేడు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు. ‘మనం బట్టలు కుట్టించుకోవాలంటే ఓ మంచి టైలర్ వద్దకు వెళతాం కానీ, అతని వద్ద కూడా కత్తెర ఉందని బార్బర్ దగ్గరకు వెళ్ళలేమని’ తీవ్ర వ్యాఖ్య చేశారు. నాయకులతో మాట్లాడడం, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో తెలియకపోవడం కాంగ్రెస్ పార్టీలో లోపాలు అని వెల్లడించారు. తాను చేసిందే కరెక్ట్, మిగిలినవారు చేసేది తప్పు, చివరకు ప్రజలను కూడా తప్పు బట్టడం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి సరికాదన్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునే స్థితిలో ఆ పార్టీ లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ను వీడిన తాను నాలుగేళ్ల విరామం తర్వాత మళ్ళీ ఆ పార్టీలో చేరానని, బలోపేతం చేయాలని భావించానని, కానీ దానికి ఆస్కారం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని, అవినీతి రహిత పాలన అందిస్తున్నారని కొనియాడారు. 1980 ఎన్నికల్లో బిజెపికి 2 సీట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపికి 303 సీట్లు వచ్చాయని.. బిజెపి ఈ స్థాయిలో ఎదుగుదల వెనుక ఎందరో నేతల అవిరళ కృషి ఉందన్నారు. దేశం పట్ల, అభివృద్ధి పట్ల బిజెపి అగ్రనాయకత్వానికి ఓ చక్కని అవగానన ఉందని ప్రశంసించారు. పేదలు, యువత సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుతున్నారని చెప్పారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించి, ఏం తప్పు జరిగిందో విశ్లేషించుకొని దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నాలు చేయాలని కానీ ఇది జరగడం లేదని కిరణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.