గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సిఎం జగన్ 98.4 శాతం నెరవేర్చారని, అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టగలుగుతున్నామని వైసీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజలు తమను సాదరంగా స్వాగతిస్తున్నారని, మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రజలు అంటున్నారని వెల్లడించారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాదారు. ప్రజలు స్వచ్ఛందంగా వారి ఇంటికి వారే స్టిక్కర్లు అంటించుకుంటున్నారని… జగనన్న స్టిక్కర్ ముద్ర ప్రతి ఇంటిపై పడుతుంటే టిడిపి నేతల గుండెల్లో గునపాలు దిగినట్లు అవుతోందని ఎద్దేవా చేశారు. టిడిపి నేతలు ఫ్రస్ట్రేషన్ తోనే విమర్శలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే వారి మేనిఫెస్టో కూడా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని సవాల్ చేశారు. పేదలకు రెండు లక్షల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా పారదర్శకంగా అందించామని, టిడిపి వారు కూడా వారి పాలనలో ఏమి చేశారో చెప్పాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు సెల్ఫీ బాబుగా మారారని, సెల్ఫీలు దిగి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని, నిజంగా చిత్తశుద్ది ఉంటే అయన సిఎంగా ఉండగా పూర్తయిన ఇళ్ళ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగితే బాగుండేదని కల్యాణి వ్యాఖ్యానించారు. జగన్ పూర్తి చేసిన ఇళ్ళ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగడమేమిటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 వేల టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని, వచ్చే రెండు నెలల్లో మరో నలభై వేల మందికి అందిచంబోతున్నామని, మొత్తంగా లక్షా 30 వేల ఇల్లు ఇవ్వబోతున్నామని వివరించారు. 17 వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని, అక్కడకు వెళ్లి సెల్ఫీ దిగాలని బాబుకు హితవు పలికారు.