మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో సబ్‌స్టేషన్ ప్రారంభించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని, అందులో స్థానిక పిల్లలకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. చీర్లవంచ నుంచి వలస పోయినవాళ్లంతా వాపస్ వస్తున్నారని చెప్పారు. గ్రామంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసుకుందామన్నారు.
Aqua Hub: సిరిసిల్ల జిల్లాలో ఆక్వా హబ్
చీర్లవంచకు త్వరలో ఒక పీహెచ్‌సీని తీసుకొస్తామని, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా చూస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులకు రూ.3 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చీర్లవంచలో రూ.12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. దళితులలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకే దళిత బంధు కార్యక్రమం అమలుచేస్తున్నామన్నారు.