1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని, పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకొని అవసరమైన మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు. సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేసేందుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సులు ఉండనున్నాయి. వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
- ఈ సందర్భంగా పలు సూచనలు చేస్తూ…
- స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి.
- సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి
- పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది, ఆ తర్వాత తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు
- పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం
- ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి.. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి
- ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
- డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం అని సిఎం అన్నారు
విద్యాకానుక, సబ్జెక్టు టీచర్లు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు, స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలు, విద్యార్ధులకు అందించిన ట్యాబ్ ల పనితీరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్, ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు పనులపై కూడా సిఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రభుత్వసలహాదారు ఎ సాంబశివారెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.