Sunday, November 24, 2024
HomeTrending NewsKodali Nani: టచ్ లో ఉండాల్సింది ప్రజలు: కొడాలి

Kodali Nani: టచ్ లో ఉండాల్సింది ప్రజలు: కొడాలి

చంద్రబాబు గుడివాడ పర్యటనతో తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేమీ ఉండదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బాబు గుడివాడ వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. రావి వెంకటేశ్వర రావు, దేవినేని అవినాష్ ల తరఫున ప్రచారం చేస్తే వారు ఓటమి పాలయ్యారని అన్నారు. బాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ శని అని, కరవు విలయ తాండవం చేస్తుందని ధ్వజమెత్తారు. బాబు స్వగ్రామం నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో  గత ఐదుసార్లూ టిడిపి ఓటమి పాలైందని, సొంత వూరు ఉన్న అసెంబ్లీని గెలిపించుకోలేని ఆయన గుడివాడలో ఏం చేయగలుగుతారని ప్రశ్నించారు. బాబు రాకపోతే కనీసం పోటీలో ఉంటారని, వస్తే అసలు పోటీలో కూడా ఉండబోరని ఎద్దేవా చేశారు.

తమకు  40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు, టచ్ లో ఉండాల్సింది ప్రజలు కానీ, ఎమ్మెల్యేలు కాదన్నారు. తాను చెప్పినట్లు ప్రజల్లోకి వెళ్లి తిరగక పొతే సీట్లు ఇవ్వలేనని సిఎం జగన్ ఎప్పుడో ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పారని ,  ఆ సూచన పాటించని వారికి టిక్కెట్లు ఇవ్వలేనని చెప్పారని, అలాటి వారు వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని కొడాలి అన్నారు.

ఇప్పుడు వై నాట్ 175 అని జగన్ అంటే చూడాలని ఉందంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూడా నాని ఘాటుగా రిప్లై ఇచ్చారు. జగన్ గత ఎన్నికల్లో బాలయ్య ఇద్దరు అల్లుళ్ళనూ ఒకరిని ఎమ్మెల్యేగా, మరొకరిని ఎంపీగా ఓడించి ఇంటికి పంపారని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు బాలయ్యనూ ఓడిస్తారని నాని అన్నారు. అప్పుడు బాబుతో పాటు బాలయ్య, అయన ఇద్దరు అల్ల్లుళ్ళూ నలుగురూ కలిసి గేమ్ అడుకోవచ్చని వ్యంగ్యంగా అన్నారు.

జన సేన పోటీ చేసిన గత ఎన్నికల్లో ఆ పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం జరిగిందని, వైసీపీకి కాదని తాము గెలిచిన చోట జనసేన రెండో స్థానంలో, టిడిపి మూడో స్థానంలో ఉన్నాయని.. జనసేన గెలిచినా రాజోలులో తాము రెండో స్థానంలో నిలిచామని విశ్లేషించారు. ప్రజారాజ్యం సమయంలో కూడా ఆ పార్టీ వల్ల టిడిపి నష్టపోయిందని కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేసినా తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని, ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని కొడాలి ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్