టాలీవుడ్ లో సహనం .. సమర్ధత .. పట్టుదల .. ఈ మూడూ ఉన్న దర్శకుడిగా గుణశేఖర్ కనిపిస్తారు. తన కెరియర్ ఆరంభంలోనే బాలలతో రామాయణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆయన. ఆ తరువాత యాక్షన్ .. ఎమోషన్స్ తో కూడిన భారీ సినిమాలను కూడా ఆయన హ్యాండిల్ చేయగలరని నిరూపించుకున్నారు. అలాంటి గుణశేఖర్ నుంచి వచ్చిన ‘రుద్రమదేవి’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన కథలను ఆయన గొప్పగా తెరకెక్కించగలడనే పేరు తెచ్చుకున్నారు.
ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఏడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఆయన నుంచి రావడానికి ‘శాకుంతలం’ రెడీ అవుతోంది. శకుంతల – దుశ్యంతుల కథ ఇది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రానుంది. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ‘రుద్రమదేవి’ తరువాత గుణశేఖర్ నుంచి మరో సినిమా రావడానికి ఇంతాకాలం ఎందుకు పట్టింది? అనే ఆలోచన కొంతమందికి కలగడం సహజం.
నిజానికి ఆయన ‘రుద్రమదేవి’ తరువాత ‘హిరణ్యకశిప’ చేయాలనుకున్నారు. రానా హీరోగా .. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయవలసి ఉంది. మూడేళ్ల పాటు ఈ సినిమాకి సంబంధించిన కసరత్తును అన్ని వైపుల నుంచి గుణశేఖర్ చేస్తూ వచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. దాంతో అప్పటికప్పుడు ఆయన ‘శకుంతల’ కథను పట్టుకుని రంగంలోకి దిగవలసి వచ్చింది. అందువలన ఇంత సమయం పట్టేసింది. ఇక ‘హిరణ్య కశిప’ స్క్రిప్ట్ రెడీగా ఉంది గనుక, ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ఇంత సమయం పట్టకపోవచ్చు.