Tuesday, September 17, 2024
HomeTrending Newsబయ్యారం ఉక్కుతో గిరిజనులకు ఉద్యోగాలు - బిఆర్ ఎస్

బయ్యారం ఉక్కుతో గిరిజనులకు ఉద్యోగాలు – బిఆర్ ఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గౌరవించి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బయ్యారంలో అందుబాటులో ఉన్న, దీనికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో బైలదిల్లలో నిక్షిప్తమైన నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వెనుకబడిన మహబూబాబాద్ జిల్లాలో పరిశ్రమను నెలకొల్పవచ్చన్నారు. ఎంపీ రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,లోకసభ సభ్యురాలు మాలోతు కవితతో కలిసి అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ ఎల్పీలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. వేలమంది గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కాలరాస్తూ,విభజన చట్టాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా,గౌరవించకుండా ప్రధాని మోడీ తన మిత్రుడు అదానీకి మరింత మేలు చేసేందుకు బయ్యారంలో పరిశ్రమను నెలకొల్పకపోవడం బాధాకరమన్నారు.బయ్యారంలో పరిశ్రమను ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ, కాంగ్రెసు ఎంపీలు,ఆ పార్టీల అధ్యక్షులు సంజయ్,రేవంత్ రెడ్డిలు నోరుమెదపకుండా,కొట్లాడకుండా గిరిజన యువతకు, తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.

అలాగే, ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మోడీ ఒక్కొక్కటిగా తెగనమ్ముతున్నారని, నిర్వీర్యం చేస్తూ అదానీకి అప్పన్నంగా కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.బైలదిల్ల నుంచి కేవలం 150కిలోమీటర్లు దూరంలోనే ఉన్న బయ్యారంకు కాకుండా 1800కిలోమీటర్ల దూరాన గల గుజరాత్ రాష్ట్రంలోని ముద్రాకు ఇనుప ఖనిజాన్ని తరలించుకుపోయేందుకు అదానీకి ప్రధాని సహకరించడం శోచనీయమన్నారు.50 లక్షల కోట్లతో భారీ జాతీయ బడ్జెట్ ను ప్రవేశపెట్టి పార్లమెంటులో ఏ మాత్రం చర్చకు తావివ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఆమోదింపజేసుకోవడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.అదానీ ఆర్థిక నేరాలపై జేపీసీ నియమించాలంటూ 18ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో చేసిన పోరాటాన్ని మోడీ తోసిపుచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రవిచంద్ర ఆవేదన చెందారు.మోడీ అవలంభిస్తున్న నిరంకుశ, నియంతృత్వ పోకడలను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని, అంతిమంగా న్యాయం,ధర్మం,ప్రజాస్వామ్యమే విజయం సాధిస్తుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్