ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సిఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తద్వారా తెలంగాణ ఆదర్శంగా భారత దేశంలో వొక నవ శకం ప్రారంభమైంది. వివక్షకు గురవుతూ తర తరాలుగా విస్మరించబడుతూ వస్తున్నదళిత తదితర వర్గాల పట్ల ఈ దేశ పాలకులు అనుసరించాల్సిన విధానాలకు అసలు సిసలు భాష్యం చెప్తూ అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ వేదికైంది.
అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన, బాబాసాహెబ్ మనుమడు మాజీ లోక్ సభ సభ్యుడు ప్రకాశ్ అంబేద్కర్ ను తోడ్కొని ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 3.15 కు బయలు దేరిన సిఎం కేసీఆర్ నేరుగా హుసేన్ సాగర్ పక్కనే ఆవిష్కరణకు సిద్దమైన అంబేద్కర్ మహా విగ్రహం చెంతకు చేరుకున్నారు.
అక్కడ బౌద్ధ బిక్షువులు వారి సాంప్రదాయ పద్దతిలో ప్రార్థనలు చేస్తూ సిఎం కేసీఆర్ కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదక మీదికి చేరుకుని అక్కడ నుంచి విశ్వరూపుడై నిలిచిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని తలెత్తి దర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహానికి అలంకరించిన మహా పూలదండ ను సిఎం పరిశీలించారు. పూలదండ తయారీ తోపాటు పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దిన తీరు గురించి ఆరా తీసారు. విగ్రహావిష్కరణ ఏర్పాట్ల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం మంత్రి ప్రశాంత్ రెడ్డిని కొప్పుల ఈశ్వర్ ను ఈ సందర్భంగా అభినందించారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా ఆకాశమంత ఎంత్తునించి పూల వాన కురిసింది. గులాబీ రేకులు పూలవానై కురుస్తండగా జై భీం అంటూ నినాదాలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సిఎం ఘన నివాళులు అర్పించారు. సంతోషంతో కరతాళధ్వనులు చేశారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన బేస్ భవనాన్ని ప్రకాశ్ అంబేద్కర్ చేతులమీదుగా సిఎం ఆవిష్కరింప చేశారు. విగ్రహ వేదిక మీదకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ పాలరాతి స్థూపానికి బౌద్ధ సాంప్రదాయంలో భిక్షువులు ప్రార్థనలు చేశారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు.
బేస్ భవనంలో ఏర్పాటు చేసిన డా బిఆర్ అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు ప్రజాప్రతినిధులు సిఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటరాగా సిఎం ప్రతి వొక్క ఫోటోను ఆసక్తితో తిలకించారు. చారిత్రక సందర్భాలను గుర్తుచేసుకుంటూ ప్రకాశ్ అంబేద్కర్ తో చర్చిస్తూ ముందుకు సాగారు. ఆడిటోరియానికి చేరుకున్న సిఎం.. ఎస్సీ కార్పోరేషన్ రూపొందించిన…ఆత్మబంధువు అంబేద్కరుడు….డాక్యుమెంటరీని ప్రకాశ్ అంబేద్కర్ తో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులు సిఎస్ ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు. డాక్యమెంటరీలో పొందుపరిచిన అంబేద్కర్ జీవిత గాథను, భారత దేశానికి వారు చేసిన సేవలను., వాటితో పాటు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం దళితాభ్యున్నతికోసం అమలు చేస్తున్న దళితబంధు వంటి విప్లవాత్మక పథకాల వివరాలను, సాధించిన విజయాలతో కూడిన డాక్యుమెంటరీని సిఎం కేసీఆర్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అక్కడనుంచి నేరుగా ప్రకాశ్ అంబేద్కర్ ను తోడ్కొని సభా వేదికకు సిఎం కేసీఆర్ చేరుకున్నారు.
వేదికమీదకు సిఎం చేరుకోగానే.. సభికులు జై భీం జైతెలంగాణ జై కేసీఆర్ నినాదాలు చేసారు. వారి నినాదాలతో సభా ప్రాంగణం మారు మోగింది.
కేసీఆర్ కామెంట్స్:
అంబేద్కర్ విశ్వానికే ఒక మహనీయుడు. ఇది అంబేద్కర్ విగ్రహం కాదు. ఇది ఒక విప్లవం. అంబేద్కర్ విగ్రహంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంబేద్కర్ పేరు పైన ప్రతి ఏటా అవార్డులు ఇస్తాం. ప్రతి అంబేద్కర్ జయంతి రోజున, అంబేద్కర్ పేరు పైన ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డు ఇస్తాం. ఇందుకోసం రూ. 51 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రతి ఏటా వడ్డీ రూపంలో 3 కోట్ల రూపాయలు వస్తాయి. ప్రజలు గెలిచే రాజకీయం రావాలి.
ప్రపంచ వ్యాప్తంగా అణగారిన జాతులకు అంబెడ్కర్ ఆదర్శం. అంబెడ్కర్ ఆశయాలు అమలు జరుగుతున్నాయా? లేదా అనేది దేశంలో చర్చ జరగాలి. అంబెడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదు. అంబెడ్కర్ పేరిట 51కోట్లతో ప్రతీ జయంతి రోజున అవార్డులు అందిస్తాం. 2014కు ముందు పదేళ్లు పాలించిన ప్రభుత్వం దళితుల కోసం 16వందల కోట్లు ఖర్చు చేస్తే …ఈ పదేళ్ళలో 1లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసాము. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియాలో వచ్చే ప్రభుత్వం మనదే.
మన ప్రభుత్వం రాగానే దేశంలో 25లక్షల దళిత కుటుంబాలకు దళితబందు ఇస్తాం. మహారాష్ట్రలో ప్రారంభమైన బిఅరెస్ ప్రభంజనం యూపీ, బెంగాల్, ఒడిశాలో రాబోతోంది. ఈ ఏడాది 1లక్ష 20వేల మందికి దళితబందు ఇవ్వబోతున్నాం. దేశంలో మనం రావాలంటే చిలోద్దు కలిసి పోరాటం చేయాలి.