నాలుగేళ్ల జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ పేదరికంలో కూరుకుపోతే, అయన మాత్రం దేశంలో ధనిక సిఎం గా ఉన్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మొత్తం 30 రాష్ట్రాలు ఉంటే మిగిలిన అందరి సిఎంల ఆస్తులు కలిపి 490 కోట్లు అయితే, జగన్ ఒక్కడి ఆస్తులు 510 కోట్ల రూపాయలు అని అన్నారు. జగన్ ఏ స్కీము తెచ్చినా దానిలో స్కాము ఉంటుందన్నారు. యువ గళం పాదయాత్ర అనంతపురం నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. డోన్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. సిఎం జగన్ ను రిచ్ మోహన్ అంటూ అభివర్ణించారు. ఈ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతోందని, విద్యుత్, ఆర్టీసీ, చెత్త పన్నులతో సామాన్యులపై ఆర్ధిక భారం మోపోతోందని దుయ్యబట్టారు. తమ హయంలో రంజాన్ సమయంలో మసీదులకు రంగులు వేసేందుకు నిధులు ఇచ్చామని… ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం ఇచ్చామని కానీ ఈ ప్రభుత్వం మైనార్టీలను కూడా వేధిస్తోందని అన్నారు.
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అప్పుల అప్పారావు గా మారారని, ఆయన ఎప్పుడు చూసినా ఢిల్లీ లోనే ఉంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. బుగ్గన అవినీతిలో టాప్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దేవుడి భూములను కూడా వదలడం లేదని, 26 ఎకరాలు స్వాహా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని… బుగ్గన అవినీతిని ప్రశ్నించిన వ్యక్తిని కొట్టి చంపారని, తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.