విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా నిర్ధారించిందని, దీనితో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. నాటి సంఘటనను అప్పటి సిఎం చంద్రబాబు, మంత్రులు కోడి కత్తి కేసు అంటూ ఎగతాళి చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ స్వయంగా ఈ దాడి చేయించుకున్నారనే అర్ధం వచ్చేలా నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై కన్నబాబు మండిపడ్డారు. తీర్పు ఇవ్వడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పుడు కూడా చంద్రబాబు, అయన భజన బృందం ఎల్లో మీడియా ప్రతిరోజూ జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయని కన్నబాబు ఆరోపించారు. ప్రతిరోజూ ఇష్టానుసారం అబదాలని వండి వారుస్తున్నారన్నారు. మొన్న జరిగిన సంక్రాంతి కోడి పందేల్లో కూడా కత్తి గుచ్చుకొని ఇద్దరు చనిపోయారని, ఈనాడు లో ఈ వార్త వచ్చిందని తెలిపారు. అత్యంత భద్రతతో, కనీసం గుండుసూది కూడా అనుమతి లేని విమానాశ్రయం లాంజ్ లోకి కోడి కత్తి ఎలా వచ్చిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని అడగడంలో తప్పేమిటని కన్నబాబు కన్నబాబు ప్రశ్నించారు.
పనికి మాలిన, ఔట్ డేటెడ్ రాజకీయనాయకుడు డిఎల్ రవీంద్రా రెడ్డి స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. జగన్ సానుభూతి కోసం తన తల్లినో, చెల్లినో కూడా మట్టుబెడతారంటూ డిఎల్ చేసిన వ్యాఖ్యలపై కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా అంతో ప్రశ్నించారు. భారతి రెడ్డి రాజ్యాంగం అని చెప్పడం మతి భ్రమించిన మాటలని మండిపడ్డారు.