Sunday, November 24, 2024

పాటలో ఏముంది?

Literature is Life:
పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని ఆమధ్య హైదరాబాద్ ఐ ఐ టీ లో ఒక పరిశోధన నిరూపించింది.
సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో సాహిత్యమే మనసు వెంటపడుతుంది. ఆలోచింపచేస్తుంది. భావోద్వేగాలకు పాటలో సాహిత్యమే ప్రధానం తప్ప , అందులో సంగీతం కాదు. సాహిత్యం ఆలోచనామృతం- సంగీతం ఆపాతమధురం. రెండూ సరస్వతీ దేవి ప్రసాదాలే అన్నది అనాదిగా మన నమ్మిక.

తుంబురు, నారదులే మెచ్చుకునే ఆలాపన, స్వర కల్పన, శ్రుతి స్థాయి, గాన మాధుర్యం, తాళ లయాదుల ఐక్యం లాంటి సంగీత సుగుణాలు ఎన్ని ఉన్నా అందులో సాహిత్యం ఏమిటో తెలియకపోతే- హిందీ శ్రేయా ఘోషాల్ తన్మయత్వంతో మృదు మధురంగా తెలుగులో పాడుతుంటే సంగీతంలో వంక పెట్టడానికి వీల్లేకపోయినా సాహిత్యం తేలిపోయినట్లు…సాహిత్యం బిక్కు బిక్కు మంటూ భయం భయంగా పదాలు తెలిసీ తెలియనట్లు, తెలుగే అయినా తెలుగు కానట్లు, చిత్ర విచిత్రంగా ఉంటుంది. భాష తెలియని వారు పాడినప్పుడు- ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పటి తరంలో మలయాళీ చిత్ర లాంటివారు ఎక్కడో కోటికొక్కరు దీనికి మినహాయింపు.

పాతతరంలో ఘంటసాల, పి. సుశీల, పి బి శ్రీనివాస్, ఎస్ జానకి, వాణి జయరాం, ఎస్ పి బాలు లాంటి వారు వారి మాతృభాష దాటి మిగతా భాషలవారి మనసులు గెలిచారు. దానికి కారణం- పాడుతున్న పాట లిపిలో ఏముందో అన్నదానికంటే- ఆ భాషవారు ఆ మాటను ఎలా ఉచ్చరిస్తారో తెలుసుకుని పాడడమే.

పాటలో సంగీతం ఇష్టమున్నవారు సాహిత్యాన్ని గాలికొదిలేస్తారు. సాహిత్యం ఇష్టమున్నవారు సంగీతాన్ని పట్టించుకోరు. అందుకే వేటూరి పాడలేడు. బాలు రాయలేడు. కె వి మహదేవన్ అసలు రాయడు, పాడడు. కానీ ఎవరి గొప్ప వారిదే. అయితే మహదేవన్ రాగయుక్తంగా స్వరాలను కూర్చాలన్నా, బాలు శ్రావ్యంగా పాడాలన్నా ముందు వేటూరులు రాయాలి. ఆ రాసింది అర్థవంతంగా ఉండాలి. ఆ అర్థం ఆలోచింపచేయాలి. ఇదంతా ఒక సమాహార విద్య.

అన్నమయ్య, రామదాసు, పురందరదాసు, త్యాగయ్య, ముత్తుస్వామి, శ్యామ శాస్త్రి లాంటివారు వారే రాసి, వారే రాగం కట్టి, వారే పాడి లోకానికి సంగీత సాహిత్యాలను కలిపి అమృతమయమయిన ప్యాకేజీగా ఇచ్చిన వాగ్గేయకారులు. ఉదాహరణకు ఒక గొప్ప రాగాన్ని శాస్త్రీయంగా ఎలాంటి దోషాల్లేకుండా వయోలిన్, వీణ, వేణువు మీద వాయిస్తున్నారని అనుకుందాం. లేదా ఆ రాగ స్వరాలను మాత్రమే సాహిత్యం లేకుండా గాయకుడు పాడుతున్నాడని అనుకుందాం. మహా అయితే ఆ సంగీతం లోతులు తెలిసిన ఒకరిద్దరికి అర్థమై ఆనందిస్తారేమో కానీ- సామాన్య జనానికి రుచించదు.

మానవేతిహాసంలో భాష ఒక అద్భుతమయిన ఆవిష్కరణ. సకల సృజనాత్మక ప్రక్రియలకు భాష పునాది. చివరికి భాషతో పనిలేని ఒక వర్ణ చిత్రాన్ని వర్ణించి చెప్పాలన్నా భాషతోనే సాధ్యం. పద్యం, పాట, జానపదం, గద్యం, కథ, నవల, నాటకం, సినిమా, వార్త, వ్యాఖ్య, విశ్లేషణ, విమర్శ, పరిశోధన, ప్రవచనం, సాధారణ వచనం…ఏదయినా భాషతో వ్యక్తం కావాల్సిందే. బంగారు పళ్ళేనికయినా గోడ చేర్పు అవసరం. ఎంత గొప్ప సంగీతానికయినా సాహిత్యమే ప్రధానం.

“ఎందరో మహానుభావులు” అన్న త్యాగయ్య కీర్తన కొన్ని వేల కీర్తనల సారం. సంగీత, సాహిత్యాల్లో కొన్ని వేల మహా గ్రంథాలతో సమానం. శ్రీరాగం ఆది తాళంలో ఉన్న ఈ ఎందరో మహానుభావులు సంగీతపరంగా ఎంత గొప్పదయినా- అందులో ఒక్కొక్క చరణంలో త్యాగయ్య దట్టించిన తెలుగు భాష- తెలుగు బతికి ఉన్నంతవరకు వెలిగేది. సాధారణంగా త్యాగయ్య పల్లవి, అను పల్లవి, ఒక చరణంతోనే రా రా మా ఇంటిదాకా! అని రాముడితో నేరుగా మాట్లాడగలడు. అలాంటిది ఎందరో మహానుభావుల్లో అనేక చరణాలున్నాయి. భక్తి సాహిత్యంలో త్యాగయ్యది పోతన స్థాయి. భక్తిని పిండి ప్రతి చరణాన్ని పవిత్రీకరించిన ఈ కీర్తన సాహిత్యం నిజానికి సంగీతాన్ని దాటిన భావ ప్రపంచానికి చెందినది. స్వరాలకు ఈ సాహిత్యాన్ని విరుచుకునే వారు ఇప్పటికీ- ఎందరో మహా- నుభావులు అనిగానీ, మహాను- భావులు అనిగానీ… అంటూ…నుభావులు, భావులు మహా గొప్ప వారని పాడుతున్నారు. భాషను మంత్రమయం చేసి ప్రతి పదంలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదను గుదిగుచ్చిన త్యాగయ్య ఎట్టి పరిస్థితుల్లో నుభావులు అని విరిచి ఉండడు. సంగీతం మాత్రమే పట్టుకుని, సాహిత్యాన్ని వదిలేసిన మన నిర్లక్ష్యమిది. సంధి, సమాసం, విభక్తి, కర్త కర్మ క్రియ అన్వయాలు, ఉచ్చారణ సంప్రదాయం పట్టించుకోని మన అశ్రద్ధ ఇది.

“భావింప సకల సంపద రూపమదిగో” అన్నాడు అన్నమయ్య. భావించడానికి భాషే ఆధారం. భావించడానికి భాషే సోపానం. పాటల్లో మాధుర్యాన్ని భావించడానికి మాటలే ఆధారం. పాటకు మాటే ప్రాణం.

ఇప్పటి సినిమా పాటల్లో సాహిత్యం మాటలు వినగలిగితే వారికి అతీంద్రియ శక్తులు ఉన్నట్లు లెక్క. కెవ్వు కేకల్లో భయ విహ్వల విధ్వంస దారుణ శబ్ద విస్ఫోటనాలే తప్ప కుదురుగా మెదడును ఆలోచింపచేయగల మాటలు వినపడవు. వినపడినా అర్థం కావు. అర్థమయినా అవి రత్తాలు బొత్తాలు పెట్టడం దగ్గరే ఆగిపోతాయి.
అరుపులు వేరు.
శబ్దాలు వేరు.
స్వరాలు వేరు.
మాటలు వేరు.
అర్థమున్న మాటలు సుశబ్దంగా స్వరంలో ఒదగడం వేరు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్