గొర్రెల పెంపకం దారులకు తమ ప్రభుత్వంలో ఎన్నో రకాల సబ్సిడీలు అందించామని, జగన్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గొర్రెలు కొనేందుకు సబ్సిడీ, మేత, దాణా, మందులు రాయితీపై తాము అందించామని గుర్తు చేశారు. లోకేష్ యువ గళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పల్లె దొడ్డిలో రైతు నాగమ్మ గొర్రెల ఫామ్ ను లోకేష్ సందర్శించారు. గొర్రెల పెంపకం, ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీలు, వారి సమస్యలపై ఆరా తీశారు.
ఈ ప్రభుత్వ హయంలో కనీసం గొర్రెలకు అందించేందుకు తాగు నీరు కూడా లేని పరిస్థితి నెలకొని ఉందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల పెంపకందారులు అధైర్యపడవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో అందించిన సబ్సిడీలు పునరుద్దరిస్తామని, షెడ్లు నిర్మాణం కోసం సబ్సిడీపై రుణాలు అందిస్తామని, గొర్రెల ఫామ్ హౌస్ ల నిర్మాణానికి కూడా రుణ సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలపై అవహాగన లేని సిఎం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో చూస్తున్నమంటూ జగన్ ను ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు.