జగన్ ప్రభుత్వాన్ని కూల్చడమే కొన్ని మీడియా సంస్థల అంతిమ లక్ష్యమని, అందుకే ఆయనపై రేయింబవళ్ళు అసత్య కథనాలతో వార్తలు ప్రచారం చేస్తున్నాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విజయ్ కుమార్ స్వామి మొన్న విజయవాడ వచ్చింది నవయుగ వారి విమానంలో అని, ఆయన వెంట వచ్చింది చింతా శశిధర్ నవయుగ విశ్వేశ్వర రావు తనయుడని వెల్లడించారు. రామోజీరావుకు విశ్వేశ్వర రావు బంధువు అన్న విషయం అందరికీ తెలుసన్నారు. చాలామంది స్వామీజీలు సిఎం జగన్ ను కలిసి ఆశీర్వాదం ఇస్తుంటారని గుర్తు చేశారు. విజయ్ కుమార్ స్వామి విజయవాడ వస్తున్నారు కాబట్టి తన కోరిక మేరకు ఆయన సిఎంను కలిశారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అసలు స్వామీజీని విజయవాడ తెచ్చింది ఎందుకు, మార్గదర్శి కేసుల నుంచి బైట వేయించుకోవడానికా అంటూ ప్రశ్నించారు. లాబీయింగ్ చేయించుకోవడం కోసం విజయ కుమార్ స్వామిని పిలిపించారని కథనాలు రాయడం దారుణమని, ఇంత నిస్సుగ్గుగా ఎలా రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామీజీలు, బాబాలను రాజకీయ కోణంలో చూస్తూ ఇలాంటి నీచ వార్తలు రాయడం మంచిది కాదని సలహా ఇచ్చారు.
వివేకా హత్య కేసులో నిజ నిర్ధారణ చేయాలని తామూ కోరుతున్నామని, కానీ వ్యక్తుల లక్ష్యంగా విచారణ సాగుతోందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. దోషులు తేలాల్సిన అవసరం కచ్చితంగా ఉందని, కొన్ని మీడియా సంస్థల్లో వచ్చే కల్పిత వార్తల ఆధారంగా సిబిఐ ముందుకు వెళ్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణిలో విచారణ జరుగుతుందని చెప్పడానికి కొన్ని తార్కాణాలు ఉన్నాయని, వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా విచారణ జరగడం లేదన్నారు. వివేకా వ్యక్తిగత అంశాలు ఇప్పటి వరకూ ఎవరూ మాట్లాడలేదని, కానీ విచారణ ఏకపక్షంగా సాగుతున్న దృష్ట్యా ఈ అంశాలపై కూడా దృష్టి పెట్టాలని మాత్రమే కోరుతున్నారని వెల్లడించారు.