అటవీ భూముల రక్షణ పేరుతో మణిపూర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కుకి గిరిజన తెగలో అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లేల చేశాయి. దీంతో నెల రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. జిరిభం, చురచంద్పూర్, ఉఖ్రుల్, కాంగ్‌పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో కుకి తెగ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. మణిపూర్‌లో బలమైన ఈ తెగకు చెందిన వారు పది మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఏడుగురు బీజేపీ సభ్యులు. రిజర్వ్‌డ్ ఫారెస్టు ప్రాంతం నుంచి కుకి తెగకు చెందిన ప్రజలను బయటకు పంపడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆ తెగ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.
దీనికి తోడు మణిపూర్ బీజేపీలో అసమ్మతి మొదలైంది. బీరేన్‌సింగ్ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీకే చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి వారు ఢిల్లీలో మకాం వేశారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల్లో రాధేశ్యామ్‌సింగ్, కరమ్ శ్యామ్, పవోనమ్ బ్రోజెన్, రఘురామితో పాటు మరికొందరు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో క్యాంపు వేసిన వారిలో కుకి తెగ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తున్నది.