టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. నేడు నౌపడలో జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని, అలా ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందని, శ్రీనును మీ చేతుల్లో పెడుతున్నానంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో దువ్వాడే తమ పార్టీ అభ్యర్ధిగా ఉంటారన్న విషయాన్ని జగన్ తేటతెల్లం చేశారు. సంతబొమ్మాలిలో మంచినీటి సరఫరా కోసం దువ్వాడ అడిగినట్లు 70కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు పోటీ చేసిస్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనతరం సిఎం జగన్ దువ్వాడకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సిఎం జగన్ పై టిడిపి నేతలు చేసే విమర్శలను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు కొన్నిసార్లు విపక్ష నేతలను ఘాటైన పదజాలంతో కూడా దువ్వాడ విమర్శలు చేస్తుంటారు. అయితే టెక్కలి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం కోసం దువ్వాడతో పాటు స్వయంగా అతని భార్య కూడా పోటీ పడుతున్నారు. ఒకరిద్దరు నేతలు కూడా వైసీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. దీనిపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత తొలగించేందుకు సిఎం జగన్ నేరుగా రంగంలోకి దిగి శ్రీనివాస్ ను ప్రకటించారు.