సిఎం జగన్ పేదవారికి మేలు చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అనేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బాబు… బటన్ ముఖ్యమంత్రి అంటూ జగన్ ను వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. కుటిల రాజకీయాలు చేస్తూ ప్రతిరోజూ సిఎంపై విమర్శలు చేయించడం పరిపాటిగా మారిందన్నారు. పేద ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుడికి సాయం అందించే ఆలోచన విజనరీ మైండ్ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
దేశ చరిత్రలోనే సామాజిక న్యాయంతో కూడిన సుపరిపాలన జగన్ అందిస్తున్నారని, ప్రతి ఇంటికీ కులమతాలు, పార్టీలకు అతీతంగా లబ్ధి అందిస్తుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ నాయకత్వంలోని తమ పార్టీతో యుద్ధం చేయడానికి చంద్రబాబుకు తగిన యుద్ధ సామాగ్రి లేదని, ఒక్క అంశం కూడా లేదని, అందుకే ఆయన పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమం అంశాలలో గత మీ పాలనకూ- మా హయంలో తేడా ఏమిటో చర్చించేందుకు రావాలని బాబుకు సవాల్ చేశారు. కేవలం జగన్ పై అక్కసు వెళ్ళగక్కడమే లక్ష్యంగా పని చేస్తున్నారని, తూలనాడుతున్నారని, తాము కూడా తిరిగి ఆయన్ను తిట్టించుకోవాలని చూస్తున్నారని సుధాకర్ బాబు అన్నారు. సేల్ఫీ ఛాలెంజ్ కు సిద్ధంగా ఉన్నామని… తాము అందించిన సక్షేమ పథకాల లభ్దిదారుల వద్దకు వెళ్లి దిగుదామని సూచించారు. చంద్రబాబు చేస్తున్నది చీకటి యుద్ధమని, వివేకా కేసు ఆధారంగా జగన్ పై మచ్చ వేయాలన్నదే ఆయన ధ్యేయమని దుయ్యబట్టారు.