భారత రాజ్యాంగాన్ని దేశంలోని పాలకులు అమలు చేయడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల టైంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర గురువారం సిద్దిపేట జిల్లా కోహెడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చాడ మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.
డబుల్బెడ్రూమ్ఇళ్లు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహలక్ష్మి కింద రూ.5 లక్షల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ఎందుకు చేయడం లేదని నిలదీశారు. వరద కాలువ పనుల పూర్తి కోసం మరోసారి పోరాటం చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను పడగొడుతున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యంగాన్నే మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, మర్రి వెంకటస్వామి, గడిపె మల్లేశ్, లక్ష్మి, పద్మ, ఏఐఎస్ఎఫ్రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.