మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సోమవారం ఈ కేసును సమగ్ర వాదనలు వింటామని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు 24వరకూ అరెస్ట్ చేయవద్దంటూ ధర్మాసనం తీర్పు చెప్పింది.
వివేకా కేసు తుదిదశకు చేరుకుంటున్న దశలో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. దీనితో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 25 వరకూ అరెస్టు చేయవద్దని, ఆ రోజు మళ్ళీ విచారణ జరుపుతామని చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వివేకా కూతురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని నేడు విచారణ మొదలు పెట్టిన ధర్మాసనం సునీత తరఫు లాయర్ సిద్దార్థ్ లూత్రా వాదనలతో ఏకీభవిస్తూ లోతైన వాదన వింటామని అందుకు గాను సోమవారం 9.30 గంటలకు విచారణ చేపడతామని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ దశలో అవినాష్ తరఫు లాయర్ రంజిత్ కుమార్ జోక్యం చేసుకుంటూ స్టే ఇస్తే అవినాష్ ను అరెస్టు చేస్తారని కాబట్టి కనీసం అరెస్ట్ పై అయినా మినయాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. కాగా, అవినాష్ కు కూడా నోటీసులు జారీ చేసింది.