సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే .. అన్నారో కవిగారు
ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు అని కూడా తెలిసిందే.
ఈ రోజుల్లో తిండి సంగతేమో గానీ నిద్ర పట్టడం లేదని బెంగపడేవాళ్లు ఎక్కువైపోయారు. నిజానికి కొండలు కోనల్లో తిరిగేటప్పుడు దొరికిందే తింటాం గానీ మనకిష్టమైన ఆవకాయ అన్నం కావాలన్నా రాదు . అలాగే అలసిపోయినప్పుడు మెత్తని పరుపు, దిండు పెద్ద అవసరం కావు అంటారు. కానీ హంసతూలికా తల్పాల పైన కూడా నిద్రపట్టని వారు పెరుగుతున్నారు . అన్నమో రామచంద్రా అనేవారికంటే నిద్రయే చాల సుఖమూ అంటున్నవారే ఎక్కువ. అల్లోపతీ, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం … ఏ నిపుణులనయినా కదపండి. సకలరోగాలకు శ్రేష్ఠమైన మందు కంటినిండా నిద్రపోవడమే అంటారు. తిండి అయితే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ నిద్ర అలా కాదే ! అందుకే కొందరు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోవాలని నియమం పెట్టుకుంటారు. వీరిలో కేవలం ఆఫీసులో మాత్రమే నిద్రపోయే వారుండచ్చు. అలాగే బస్ ఎక్కగానే కునుకు తీస్తారు కొందరు. అదేదో సినిమాలో బ్రహ్మానందం రైలుకి అలవాటుపడి అలాగే ఊగుతూ నిద్రపోతూ ఉంటాడు. కొందరికి ఫ్యాన్ చప్పుడు వింటేనే గానీ నిద్ర పట్టదు.
మరికొందరు ఉయ్యాల ఎక్కి ఊగుతూ నిద్రపోతారు. ఇక మన సోదర భారతీయులు సమస్యలకు కనిపెట్టే పరిష్కార సాధనాలు బహు చిత్రంగా ఉంటాయి. మాయాబజార్ చిత్రం లోని గిల్పం అందుకు ఉదాహరణ. ఏ సమస్యనుంచయినా తప్పించుకుని ఎలా నిద్రపోవచ్చో కూడా మనవాళ్ళు నిరుపిస్తుంటారు. ముంబై లోకల్ ట్రైన్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దూరాన ఉన్న ఆఫీసులకు చేరడానికి ఈ రైళ్ళే గతి. కూరగాయలు కోయడం నుంచి వీలయిన ఇంటిపనులు రైళ్లలో చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికంటే నిద్ర ముఖ్యమనుకున్న ఓ మహాశయుడు ఎంత రద్దీగా ఉన్న రైలులో అయినా హాయిగా నిద్రపోడానికి ఒక వేలాడే తాడు తయారుచేసాడు(సస్పెన్షన్ రోప్). రైలులో కొక్కానికి ఉయ్యాలలా తగిలించుకునే వీలున్న ఈ తాడుతో హాయిగా నిద్రపోవచ్చట. అంతే కాదు దాదర్ బ్రిడ్జి దగ్గర 25 రూపాయలకు ఈ తాడు అమ్ముతున్నారు కూడా. అది కొనుక్కుని ‘ఊగుతా హాయిగా చల్లగా…పసిపాపలా నిదురపోతా …’ అనుకుంటూ ప్రయాణికులు గమ్యం చేరేవరకు కునుకేస్తున్నారు.
చెట్టుకు ఉయ్యాల కట్టడం తెలుసు. చీర ఉయ్యాల తెలుసు. బల్ల ఉయ్యాల తెలుసు. వీటన్నిటికీ భిన్నంగా ఉన్న ఈ తాడు ఉయ్యాల ఇప్పటి వింత.